గరుడ వాహనంపై లోకాభి రాముడు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమ‌వారం ఉదయం పల్లకిపై మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది.

గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ ముని శంక‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends