
మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుడిని ఇలా ఏ పర్వదినానికి తగ్గట్లు ఆ దేవుడు, దేవత రూపాన్ని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలని ఆరాధించినట్లు కాదు. ఓకే దేవుడిని నాలుగుసార్లు పూజించినట్లు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపంలో వస్తాడని. అందుకనే ఇన్ని రూపాలు అని ఆదిశంకరులు చెబుతారు. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. అందుకోసం చిన్నప్పటి నుండి పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించే రామాయణ, మహాభారత, భాగవతాల కథలు తెలియజేయాలి. అందువలన ఆ కథల వలన వారిలో మంచి సంస్కారం ఏర్పడుతుంది.
బాల్యం నుండి స్వధర్మాన్ని అలవరచాలి. పిల్లలు కూడా శ్రద్దగా నేర్చుకోవాలి. వారు విననప్పుడు పెద్దలు దండన మార్గాన్ని అనుసరించి అయినా స్వధర్మాన్ని అలవారచాలి. ఉపకార గుణం అనేది మనిషిలో ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం. అది లేకపోతే మనిషి తాను మనిషి అనుపించుకోవడానికి కూడా యోగ్యుడు కాదు. కష్టాలలో ఉన్నవారికి ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనస్సులో పరిశుద్దమైన భావన ఉండాలి. ప్రఖ్యాతి కోసం చేయకూడదు. నాకేదో ఫలం లభించాలి, నేను చేసింది ప్రపంచం మొత్తం తెలియాలి అని ఆలోచించకూడదు. అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. అయన అనుగ్రహ ఫలాలను ప్రసాదిస్తాడు.
