
హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని మాసాలు ప్రత్యేకమైనవే. వాటిలో కొన్ని మాసాలు మరింత ప్రత్యేకం. అలాంటి వాటిలో ఒకటి మార్గశిర మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ఈ మాసంలో పరమ పవిత్రమైనదిగా భావించే మోక్షద ఏకాదశి పండుగ రానుంది. ఆ మరుసటి రోజు కూడా మనకు ప్రత్యేకమే. ఎందుకంటే మరుసటి రోజున మనం మత్స్య ద్వాదశిని జరుపుకుంటాం. ఈ మత్స్య ద్వాదశి నాడు దుష్ట శిక్షణ కోసం శ్రీహరి మత్స్యావతారం ధరించి సంహరించాడని నమ్ముతారు కాబట్టి ఈ రోజున మత్స్య ద్వాదశిని జరుపుకుంటాం. మరి ఈ మత్స్య ద్వాదశి ఎప్పుడు వచ్చింది?
మార్గశిర శుద్ధ ద్వాదశి తిథి డిసెంబర్ 11వ తేదీ బుధవారం రాత్రి 1:09 గంటల నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 12వ తేదీ గురువారం రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. మనం ఉదయ తిథి ఆధారంగా పండుగను జరుపుకుంటాం కాబట్టి డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజునే మత్స్య ద్వాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. మత్స్య ద్వాదశి నాడు పూజా సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ జరుపుకోవచ్చు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో కూడా మత్స్య ద్వాదశి పూజ నిర్వహిస్తారు.
