ఉండవల్లిలోని గుహాలయంలో అనంత పద్మనాభుడు ఎలా ఉంటాడంటే..

విజయవాడలోని ఉండవల్లిలో కేరళలోని అనంత పద్మనాభుడిని పోలిన అనంత పద్మనాభుడు కొలువుదీరాడని తెలుసుకున్నాం కదా. ఈ ఆలయ మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. మండపంలోని స్తంభాలపై కన్పించే చిత్రాల్లో అత్యంత అరుదుగా కన్పించే లక్ష్మీ సమేతుడైన ఆదివరాహస్వామి విగ్రహం రమణీయంగా దర్శనమిస్తుంది. అలాగే ఈ మండపంలో మరొక స్తంభంపై ఉగ్ర నరసింహుని శిల్పం ఇతర శిల్పాలతో పోలిస్తే పూర్తి వైవిద్యంగానూ.. అత్యం అందంగానూ దర్శనమిస్తుంది. ఈ శిల్పంలోని విశేషమేంటంటే.. హిరణ్యకశ్యప సంహారం గావిస్తున్న సమయంలో నరసింహునిలోని ఉగ్రావతారాన్ని మనం చూడవచ్చు.

ఇక నరసింహుని శిల్పానికి సమీపంలోనే వామనావతార ఘట్టంతో పాటు ఆ పక్కనే మరో స్తంభంపై హనుమంతుడి సందేశ ఘట్టం కూడా చిత్రించి ఉంటుంది. ఇక ఈ గుహలోని మూడో అంతస్తు చివరి మందిరంలో శ్రీ అనంతపద్మనాభుడి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవచ్చు. ఈ అనంత పద్మనాభుడు ఎంత మనోహరంగా ఉంటాడంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. నల్లని గ్రానైటు ఏకశిలా నిర్మితమైన ఈ విగ్రహ స్వరూపం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. పద్మ పత్ర విశాలాక్షువులతో అనంతశయనుడిగా మనకు దర్శనమిస్తాడు. ఆయన వద్ద దేవలంతా నాట్యం చేస్తూ ఉంటారు. ఆయన పాదాల వద్ద జయవిజయులు, తపో నిమగ్నులైన మహర్షులు, ఆకాశంలో గరుడుడి నాట్యం.. వీటన్నింటి నడుమ అద్భుత రూపంతో అనంత పద్మనాభుడు భక్తులకు దర్శనమిస్తాడు.

Share this post with your friends