
బృందావనంలోని కాత్యాయనీ దేవి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఇక్కడ కన్నయ్య కూడా అమ్మవారిని పూజించి మంచి ఫలితం పొందాడట. దేవీ పురాణం,మార్కండేయ పురాణం ప్రకారం అయితే ఈ ఆలయాన్ని సతీదేవి జుట్టు పడిపోయిన ప్రదేశంగా చెబుతారు. కాబట్టి ఈ అమ్మవారిని శక్తి పీఠంగా కూడా చూస్తారు. అమ్మవారిని పూజిస్తే తప్పక కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా ఎవరైనా వివాహం కుదరక ఇబ్బంది పడేవారు, దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొనే వారు ఈ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందట.
దేవి భగవత్ కథనం ప్రకారం కాత్య ఋషి గోత్రంలో కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. ఆయన భగవతీ దేవి అనుగ్రహం కోరుతూ చాలా కాలం పాటు తపస్సు చేశాడట. అతని తపస్సుకు సంతోషించిన శక్తిస్వరూపిణి మహర్షి ముందు ప్రత్యక్షమై వరం కోరమని కోరింది. తన ముందు ప్రత్యక్షమైన అమ్మవారి ముగ్ద మనోహర రూపాన్ని చూసి ఆనందంతో ఆమె తన కూతురి రూపంలో పొందాలనుకుంటున్నట్టుగా చెప్పాడు. మహర్షి కోరికను నెరవేర్చిన అమ్మవారు మహర్షి ఇంట బిడ్గగా జన్మించి ఆ తరువాత కాత్యాయనీ దేవిగా భక్తులతో పూజలను అందుకుంటోందని చెబుతారు.
