
శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేస్తోంది. హిందువులంతా అత్యంత వైభవంగా నిర్వహించుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి. శ్రీకృష్ణుడు ఈ రోజున దేవకి గర్భమున జన్మించాడని చెబుతారు. అయితే ఇంట్లో కూడా శ్రీకృష్ణుడిని ఈ రోజున పూజించుకుంటారు. అయితే పూజ సమయంలో ఇంటి లోపల చేయాల్సిన మార్పులు కొన్ని ఉన్నాయి. అవి చేస్తే పూజకు సత్ఫలితం లభిస్తుందని చెబుతారు. మరి ఆ మార్పులేంటో తెలుసుకుందామా.. జన్మాష్టమి వేడుకల్లో తప్పనిసరిగా శ్రీకృష్ణుడి ఊయలను అయితే ఏర్పాటు చేస్తారు. దీనిని ప్రతి ఒక్కరూ తమ స్తోమతను బట్టి తయారు చేయిస్తారు. కొందరు చెక్కతో చేయిస్తే.. మరికొందరు బంగారం లేదా వెండితో చేయిస్తారు.
ఊయలను ఏర్పాటు చేయగానే సరికాదు.. రంగు రంగుల పువ్వులతో దానిని అలంకరిస్తేనే పూజకే అందం వస్తుంది. ఇక శ్రీకృష్ణుడి చిత్ర పటం లేదంటే విగ్రహాన్ని ఇంటి ఈశాన్యం దిశలో ఏర్పాటు చేసి పూజ చేయాలి. ఇలా చేయడం వలన సత్ఫలితాలు లభిస్తాయట. శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టే స్థానాన్ని పసుపు రంగుతో అలంకరించాలి. అలాగే కన్నయ్య పూజలో వేణులు, నెమలి ఈకలను సైతం పూజ స్థానంలో పెడితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. శ్రీకృష్ణుడి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిదట. అలాగే కలశం ఏర్పాటు చేయడంతో పాటు గంగాజలంతో నింపిన శంఖాన్ని పూజలో పెట్టాలి. కన్నయ్యకు నైవేద్యంగా పండ్లు, స్వీట్స్ పెట్టాలి. అలాగే తులసి తీర్థం కూడా ఉండాలి.
