ఉండవల్లి గుహాలయంలో చూపు తిప్పుకోనివ్వని వినాయకుడు.. కారణమేంటంటే..

ఉండవల్లి శ్రీ అనంత పద్మనాభ ఆలయంలోని మూడో అంతస్తులోనికి వెళ్లడానికి గుహను అందంగా తొలిచి మెట్ల మార్గాన్ని నిర్మించడం జరిగింది. మెట్లను మలిచిన విధానం చూస్తే చాలు ఈ అంతస్తు ప్రత్యేకత ఏమిటనేది మనకు అర్థమవుతుంది. ఈ గుహాలయంలోకి ప్రవేశించడమే ఓ వింత అనుభూతి.. రెండు వరుసల స్తంభాల మధ్యలో విశాలమైన మండపం ఉంటుంది. ఇక్కడ భక్తులు కాసేపు సేదతీరకుండా వెళ్లలేరు. ఇక మండపం స్తంభాలపై దశావతారాలతో పాటు వివిధ దేవతామూర్తుల శిల్పాలుంటాయి. వాటిని చూడగానే ఏదో తెలియని అనుభూతి మనకు కలుగుతుంది.

ఎడమవైపున వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన ప్రతి శిల్పం మనల్ని ఆకట్టుకుంటుంది. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది వినాయకుడి విగ్రహం. మూడో అంతస్తులో మహా గణపతి రమణీయ శిల్పం చూపు తిప్పుకోనివ్వదు. దీనికి కారణం.. విఘ్నేశ్వరుడి తొండం మీద కన్పించే గజ చర్మంతో పాటు ముడతలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే మూడో అంతస్తులోని ఒక మందిరంలో ఉగ్రనరసింహుడు దర్శనమిస్తాడు. అయితే ఈ మండపంలో మూడు చోట్ల ఉగ్రనరసింహ స్వరూపం దర్శనమిచ్చినా కూడా రెండు చోట్ల మాత్రం ఒకే పోలికతో ఉంటాయి. ఇక్కడ ఎన్నో కుడ్య చిత్రాలు.. వాటిలో శంకరునితో పాటు వివిధ దేవతల శిల్పాలను కూడా దర్శించుకోవచ్చు.

Share this post with your friends