తమిళనాడులోని చిదంబరంలో కొలువైన నటరాజ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఆ ఆలయ స్థలపురాణం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటంటే.. పరమశివుడు ఒకనాడు తిల్లాయ్ వనవిహారానికి బయలుదేరి వెళ్లాడట. అక్కడి వనంలోని ఋషులు తమ మంత్రాలతో దేవతలను సైతం ఆవాహనం చేయగలరట. శివుడిని చూడగానే ఆ ఋషులు మంత్రులు పఠించారట. దీంతో శివుడు లొంగి పీతాంబరధారి అయి ఉసిరి కాయలు తింటున్నాడట. ఆ సమయంలో పార్వతి కూడా శివుని వెంబడించిందట. అప్పుడు ఋషులు, ఋషి పత్నులు ఆ పీతాంబరధారి అయిన పరమశివుని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు.
తమ భార్యలూ, ఇతర స్త్రీజనం కూడా శివుని పట్ల మోహితులై ఉండిపోయారట. అది చూసిన మునులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేశారట. అప్పుడు భిక్షువు రూపంలో ఉన్న శివుడు ఆ పాములన్నింటినీ తన జటాజూటంలో ముడి వేశాడట. ఆ పాములన్నీ శివుడి మెడలో.. నడుము చుట్టూ ఆభరణాల్లా వేసుకున్నాడు. అప్పుడు ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేశారట. ఆ పులి చర్మాన్ని వలిచి శివుడు నడుముకి వస్త్రంగా ధరించాడు. దీంతో విసుగెత్తిన ఋషులు వారి ‘ముయలకన్’ అనే శక్తిమంతమైన, అహంభావియైన రాక్షసిని ఆవాహన చేశారు. అప్పుడు శివుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి నాట్యం చేస్తూ తన అసలు రూపాన్ని చూపాడు. అప్పుడు శివుడికి ఋషులంతా దాసోహమయ్యారు. నాటి నుంచి శివుడు నటరాజ మూర్తిగా అక్కడ పూజలందుకుంటున్నాడని ప్రతీతి.