శ్రీ మహావిష్ణువు శ్రీ రంగనాథ స్వామిగా కొలువైన క్షేత్రాలు దక్షిణ భారతంలోనే ఎక్కువ. ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ద్రావిడ సంప్రదాయాన్ని పాటించే తమిళనాడులో రంగనాథ స్వామి ఆలయాలు అధికం. ఇక్కడ దాదాపుగా శ్రీ రంగనాథుడు స్వయంభువుగా వెలిశాడు. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లోనూ.. అది కూడా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో స్వయంభువుగా రంగనాథస్వామి వెలిశాడు. ఈ ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. అసలు రంగనాథ స్వామి ఎక్కడ వెలిశాడు? ఆయన విశేషాలేంటో తెలుసుకుందాం. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం. జె.పుల్లలచెరువు గ్రామంలో నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్య పరిధిలో రంగనాథస్వామి వెలిశాడు.

దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ స్వయంభువుగా రంగనాథస్వామి కొలువుదీరాడు. ఈ స్వామివారి దర్శనం వారమంతా లభించదు. కేవలం వారంలో ఒకరోజు మాత్రమే. అది కూడా శనివారం ఒక్కరోజే తెరిచి ఉంటుంది. ఇక్కడి స్వామివారిని నెమలిగుండ్ల రంగనాథస్వామిగా పిలుస్తారు. దీనికి కారణమేంటో తెలుసుకుందాం. పూర్వం నెమలి శిరస్సుతో ఉన్న మయూర మహర్షి అనే ఋషి నల్లమల అటవీ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడట. అనంతరం అక్కడే శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడట. ఈ సమయంలో మయూర మహర్షి తన తపోదీక్షలోనే ముక్కుతో ఒక గుండాన్ని తవ్వాడట. నెమలి శిరస్సుతో ఉన్న మహర్షి నిర్మించిన గుండం కాబట్టి ఈ గుండానికి నెమలిగుండం అనే పేరు వచ్చింది.
