కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని మహాబలిపురంలో అమృతశిల అనే ప్రత్యేకమైన రాయి లభిస్తుంది. ఆ రాతితో ఈ దేవాలయంలోని విగ్రహాలను తయారు చేయడం జరిగింది. అందుకే ఈ దేవాలయంలోని విగ్రహాలను నాణెం లాంటి ఏదైనా లోహపు వస్తువుతో కొట్టినప్పుడు సంగీత స్వరాలు పలుకుతాయి. ఇక్కడ ఇదొక అద్భుతం. ఇక ఈ శ్వేతార్క వినాయక ఆలయాన్ని స్థానికులంతా కలిసి చందాలు వేసుకుని మరీ నిర్మించారు.

తరువాతి కాలంలో ఈ శ్వేతార్క గణపతి భక్తుల పాలిట కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి గాంచడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద మొత్తంలో రావడం ఆరంభమైంది. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలే చాలా చాలా స్పెషల్. అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినాయక చవితికి సంబంధించి నవరాత్రులు అన్నిచోట్లా 9 రోజులైతే.. ఇక్కడ మాత్రం 13 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం విశేషం. వినాయక చవితి, సంకట హర చతుర్థి, వంటి ఇతర పండుగ రోజుల్లో ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. తెల్ల జిల్లేడు వేరుతో తయారైన గణపతిని పూజిస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయని గణేశ పురాణం చెబుతోంది.
