శ్వేతం అనగా తెలుపు, అర్కము అనగా జిల్లేడు, మూలం అనగా వేరు. హన్మకొండ జిల్లా, కాజీపేటలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తెల్ల జిల్లేడు చెట్టు వేరులో ఏర్పడిన గణపతి కాబట్టి ఆయనను శ్వేతార్క మూల గణపతిగా పేర్కొంటారు. వాస్తవానికి తెల్ల జిల్లేడు చెట్టు వంద సంవత్సరాలు పెరగడమే విడ్డూరం. ఒకవేళ అలా పెరిగితే మాత్రం ఆ చెట్టు వేరు మూలంలో గణపతి రూపం తయారవుతుందని నారద పురాణం తెలియజేస్తోంది. అయితే వేరు మూలంలో ఏర్పడిన గణపతి కాబట్టి ఈ విగ్రహాన్ని చెక్కడం లేదా మలచడం చేయలేదు. ఎలా ఉందో అలాగే ఉంచేశారు.

అయినా సరే.. ప్రత్యేకంగా చెక్కాల్సిన అవసరం లేకుండానే.. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, తల్పం, అన్నీ మనకు స్పష్టంగా కనిపించడమనేది ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ ఆలయ నిర్మాణం ఒడియా శైలిలో ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఇక్కడ ఇతర ఉపాలయాలు సైతం ఉన్నాయి. వీరాంజనేయ స్వామి, సీతారామ లక్ష్మణులు, పద్మావతి వేంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, శిర్డీ సాయిబాబా విగ్రహాలను సైతం ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు.
