
దైవనామ శ్రవణం వల్ల చాలా లాభాలున్నాయి. దైవనామ శ్రవణంతో మనసు ప్రశాంతమవుతుంది. కొద్దిసేపు అయినా దైవస్మరణలో నిలిస్తే మనస్సు హడావిడిలో నుంచి బయటకు వచ్చి ప్రశాంతతను అనుభవిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. నిత్యం ఒకే దైవనామాన్ని, భక్తిగీతాన్ని లేదా పవిత్ర పఠనాన్ని శ్రద్ధగా వినడం మనసును ఒక దిశలో నిలిపేందుకు సహాయపడుతుంది. ఇంటి వాతావరణం భక్తిమయమవుతుంది. ఉదయం విష్ణు నామం… సాయంకాలం అమ్మవారి స్మరణ… భయం వేళ హనుమంతుని నామం… ఇలా ఇంటిలో దైవస్మరణ మ్రోగితే మనసులకు భక్తి, ధైర్యం, శాంతి కలుగుతాయి. అంతరంగంలో శరణాగతి పెరుగుతుంది. రోజూ కొద్దిసేపు దేవుని స్మరిస్తూ వినడం వల్ల “నేనే అన్నీ చేస్తున్నాను” అనే భావం తగ్గి, స్వామీ… నీవే నా ఆధారం” అనే భక్తి పెరుగుతుంది.
ఎప్పుడు వినాలి?
వేకువజామున — శ్రీమన్నారాయణుని స్మరణ
సాయంకాలం — అమ్మవారి దైవస్మరణ
భయం, ఆందోళన వేళ — హనుమంతుని నామస్మరణ వినాల్సి ఉంటుంది. రోజుకు పది నిమిషాలైనా కళ్ళు మూసుకుని భక్తితో పఠించలేకపోయినా వినండి… అర్థం పూర్తిగా తెలియకపోయినా వింటే హృదయం భగవంతుని వైపు తిరిగితే అదే నిజమైన శ్రవణభక్తి. వామన స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు మనలోని అహంకారాన్ని తగ్గించి, భక్తిని పెంచి, ధర్మమార్గంలో నడిపిస్తారు.
