తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గోపూజలు..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి. మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఇక మూడవ రోజైన కనుమ నాడు పాడి పశువులను పూజించి నైవేద్యాలను సమర్పించారు. పల్లెల్లో నిత్య జీవితంలో పశువులు కూడా ఒక భాగం. దుక్కి దున్నే సమయం నుంచి నూర్పిళ్ల వరకూ ఇవి రైతుకు ఆసరాగా నిలుస్తాయి. అందుకే కనుమ పండుగ రోజు వీటిని పూజించి తమకు అవి ఎంతటి ప్రాధాన్యమనేది చెబుతారు. వృషభం అనుగ్రహాన్ని కనుమ వేళ పొందితే చాలా మంచిదని భక్తుల నమ్మకం.

ఈ క్రమంలోనే ఉదయాన్నే వృషభాలను చక్కగా నీళ్లతో కడిగి, పసుపు, కుంకమలతో అలంకరించి, మెడలో గంట కట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి పంట పొలాలకు తీసుకువెళ్తారు. గోవులో సర్వదేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గోవును గోమాతగా పూజిస్తాం. ఇంతటి విశిష్టత ఉన్న గోవును కొన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలో ప్రత్యేకంగా పూజలు చేశారు. చీరాల సంతబజారులో శ్రీ మహాలక్ష్మమ్మ మందిరం ఆవరణలో గోపూజా కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి స్థానికులంతా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this post with your friends