హనుమకొండ జిల్లాలోని కొత్తకొండలో కొలువైన వీరభద్ర స్వామి గురించి తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్కరూ నెత్తిన గుమ్మడికాయ, చేతిలో కోర మీసాలతో తరలివచ్చి వీరభద్రస్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. రాచ గుమ్మడి కాయను నెత్తిన పెట్టుకుని వచ్చి ఈ ఆలయంలో సమర్పించడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. జాతర నేపథ్యంలో అయితే వేలాదిగా గుమ్మడి కాయలు స్వామివారికి నైవేద్యంగా అందుతాయి. ఏ ఆలయంలోనూ లేని విధంగా వీరభద్రుడికి గుమ్మడికాయను నైవేద్యంగా సమర్పించడం వెనుక ఓ కథ ఉంది.
ఆలయ పండితులు చెబుతున్న పురాణాల చరిత్ర ప్రకారం.. గుమ్మడికాయ మొక్కులకు సంబంధించిన చరిత్ర ఈనాటిది కాదు.. పూర్వకాలం నుంచి ఉంది. పురాణాల ప్రకారం.. దక్షయజ్ఞంలో దక్షుడిని వీరభద్రుడు సంహరించాడు. ఆ సమయంలో వీరభద్రుడు కోపంతో ఊగిపోతున్నాడట. ఆయనను శాంతింప చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదని దేవతలు గుర్తించారట. పరిహారంగా కూష్మాండం అంటే రాచగుమ్మడి కాయను సమర్పించి వీరభద్రుడిని శాంతింపజేశారట. అప్పటి నుంచి వీరభద్రుడికి మొక్కుగా గుమ్మడికాయను సమర్పిస్తున్నారు. ఇక్కడ సంక్రాంతి నందర్భంగా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వారంతా స్వామివారికి గుమ్మడికాయను సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు.