సంకష్ట హర చవితి వ్రతాన్ని ఎన్ని రోజుల పాటు చేసుకోవాలి?

సంకష్ట హర చవితిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సంకష్ట చవితి వ్రతాన్ని ఎన్ని రోజుల పాటు నిర్వహించుకోవాలి. సంకష్ట గణపతి పూజా విధానం ఏమిటి? ఎన్ని రోజుల పాటు నిర్వహించుకోవాలో తెలుసుకుందాం. ప్రతి మాసంలోనూ సంకష్ట చతుర్థిని జరుపుకుంటూ ఉంటాం. ఏ మాసంలో అయినా పౌర్ణమి తరువాత నాలుగో రోజున బహుళ చవితి రోజు సంకష్ట చవితి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. అంటే ఈ మాసంలో ఇవాళే సంకష్ట గణపతి వ్రతాన్ని జరుపుకుంటున్నాం. అయితే సంకష్ట హర చతుర్థి పూజను సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది. వ్రతం చేసుకునేవారు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.

సంకష్ట హర చతుర్థి వ్రతాన్ని చేసుకునే వారు.. కనీసం 5 వారాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 9, 11, 21 మాసాల పాటు సైతం చేసుకుంటారు. ఎన్ని మాసాల పాటు చేసుకోవాలనేది.. చేసుకునేవారిపై ఆధారపడి ఉంటుంది. సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించే వారు ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించి గణపతిని పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దానిలో ఒకటింపావు కేజీ బియ్యం పోయాలి. దానిలో 5 ఎండు ఖర్జూరాలు, 5 పసుపుకొమ్ములు, 5 వక్కలు ఉంచి రూ.11 దక్షిణ ఉంచి మనసులోని కోరికను గణపతికి చెప్పుకోవాలి. అనంతరం ముడుపు మూట కట్టి గణపతి ముందు పెట్టాలి. కొబ్బరినూనెతో దీపారాధన చేసి నిత్యపూజాధికాలు ముగించుకోవాలి. అనంతరం ధూప దీపాలతో వినాయకుని పూజించుకోవాలి.

Share this post with your friends