
ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిదీశః జలరూపో వినాయకః
తొమ్మిది రోజుల పాటూ ఘనంగా పూజలందుకున్న వినాయకుడు అట్టహాసంగా గంగమ్మ ఒడికి చేరిపోతాడు. గణనాథుని నిమజ్జనం వెనుక అంతర్యం ఉంది.వినాయకుడు జల తత్వానికి ప్రతీక అందుకే గంగాసుతాయ నమః’ అని వినాయకుణ్ని పూజిస్తాం ప్రకృతిని పులకింపజేసేదే గణపతి ఆరాధన. ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరిచిపోకుండా ఉండేందుకే సంవత్సరానికొకసారి గణేష నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. గణపతి పండుగలోని అంతరార్థం భారీ విగ్రహాలను ప్రతిష్టించడంలో పోటీ పడడం, సినిమా పాటలకు నృత్యాలు చేయడం కాదు. ఏమట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా ఉన్నాడో ఆ గణపయ్యని శ్రద్ధతో పూజించడమే ముఖ్య ఉద్దేశం. మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగు రంగుల విగ్రహాలు కాదు మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం.
మట్టి అంటే భూమాతకు చిహ్నం. ఏ పదార్థమైనా ఆమె స్వరూపమే.. భూదేవికి మనసారా నమస్కరించి, ప్రేమపూర్వకంగా కాస్తంత మట్టిని తీసుకుని గణపతి ప్రతిమచేయాలి. వానాకాలం మొదలవడానికి ముందే చెరువులు, కుంటల్లో క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవలు, కుంటలు, చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుకున్న ఓ అంతరార్థం చెరువులు, కాల్యల పూడికతీయడం. అంటే వినాయకుడు ఇంట్లో అడుగుపెట్టక ముందే జలసిరులతో చెరువులు, కుంటలు కళకళలాడాలి. మరోవైపు మట్టి పూడికతీత పనుల వల్ల భూగర్భజల మట్టం పెరిగేది. ఇంట్లో గణేషుని మట్టి ప్రతిమలను తొమ్మిది రోజులు పూజించిన తర్వాత ఆ మట్టి గణేషుని పత్రి. నవధాన్యాలతో కలిపి ఇంటి పెరట్లో చెట్లకింద ఉంచేవారు. తద్వారా ఎంత బలహీనంగా ఉండే చెట్లయినా ఏపుగా పెరిగేవి. పూజాద్రవ్యాల్లోని పోషకవిలవలు, పత్రిలోని విశిష్టగుణాలు ఉండటమే అందుకు కారణం.
నవరాత్రులు పూర్తయ్యాక వినాయక ప్రతిమను సమీపంలో చెరువులోనో, కుంటలలోనో నిమజ్జనం చేస్తారు. కుంటలు లేని చోట బావిలోనైనా నిమజ్జనం చేయవచ్చు. ఇరవై ఒక్క రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక ఔషధ గుణాలు ఆ నీటిలో కలిసిపోతాయి. వాటి వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశించడమే కాకుండా ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమార్ధం. మా ఆహ్వానాన్ని మన్నించి దేవలోకంనుంచి వచ్చి, మా పూజలు అందుకొని మనల్ని అనుగ్రహించిన వినాయకుడిని తన దేవలోకానికి వెళ్లిరమ్మని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. భగవంతుడు. తయారు చేసిన మానం శరీరం ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా చివరకు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యాన్ని ఈ నిమజ్జనం ద్వారా తెలియజేస్తాడు గణనాథుడు. గణపతి జలరూపానికి ప్రతినిథి కనుక నీళ్లలో లయం చేయడం ద్వారా వచ్చిన చోటుకే చేరుకుంటాడన్నది తాత్త్వికార్థం.
