
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెనుమాకలో కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే భయాలు తొలగిపోయి, ఆత్మవిశ్వాసం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఎంత కష్టంలో ఉన్నవాళ్లైనా సరే ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించి హనుమను పూజిస్తే చాలు వాటి నుంచి బయటపడతారట. స్వామి అనుగ్రహంతో కష్టాలను ఎదుర్కోగల మనోధైర్యం లభిస్తుందట. ఈ క్షేత్రం ప్రశాంతతకు నిలయంగా పేర్కొంటారు. ఈ ఆలయం ప్రశాంతంగా ఉండటం వలన ఇక్కడికి వెళ్లినవారు ఆధ్యాత్మిక సాధనలో గడిపేస్తుంటారు. ఇది ధ్యానం చేయడానికి అనువైన ప్రాంతంగా పేర్కొంటారు.
ఇక్కడికి వచ్చి భక్తులు ఏదైనా పని పూర్తి కావాలని కోరుకుంటే తప్పక పూర్తవుతుందట. అందుకే పెనుమాక హనుమను కార్యసిద్ధి హనుమంతుడని కూడా పేర్కొంటారు.
పెనుమాక ఆంజనేయ స్వామి క్షేత్రంలో ప్రతిరోజు నిత్యపూజలు యధావిధిగా జరుగుతాయి. అయితే ప్రతి మంగళ, శనివారాల్లో మాత్రం స్వామివారికి అభిషేకం, ఆకుపూజ, సింధూర పూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి శనివారం ఈ ఆలయంలో శని దోష నివారణ పూజలు జరుగుతుంటాయి. వీటికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతూ ఉంటారు. అలాగే ప్రతి శనివారం, మంగళ వారం రోజుల్లో హనుమంతునికి వడమాల, అప్పాల మాల కూడా వేస్తుంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంటుంది. ఏడాదిలో రెండుసార్లు వచ్చే హనుమజ్జయంతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా వైభవంగా జరుగుతుంది.
