
ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఉన్న పృథ్వీనాథ్ ఆలయం గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ ఆలయ కథ మహాభారతంతో ముడిపడి ఉంది. పాండవులు అజ్ఞాతవాస సమయంలో తల్లి కుంతితో కలిసి కౌశల రాష్ట్రంలోని పంచారణ్య ప్రాంతానికి వచ్చారు. అక్కడే భీముడు శివుడిని ప్రతిష్టించడంతో కుంతీ దేవి పూజలు నిర్వహించేది. అప్పట్లో పాండవులు అక్కడి ఓ బ్రాహ్మణ ఇంట్లో ఉండేవారు. ఈ ప్రాంతాన్ని ఆ సమయంలో చక్రనగరి లేదంటే ఏకచక్ర నగరి అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో ఆ సమయంలో భయంకరమైన రాక్షసుడు బకాసురుడు నివసించేవాడు. స్థానికులు అతడిని చూసి భయపడిపోయేవారు. నిత్యం అతని కోసం ఒక బండి నిండా తినుబండారాలను తీసుకుని ఒక వ్యక్తి వెళ్లేవాడు.
బకాసురుడు అన్నింటినీ ఆరగించేవాడు. ఒకరోజు పాండవులు ఉంటున్న బ్రాహ్మణ కుటుంబం వంతు వచ్చింది. వారు బకాసురుడికి ఆహారం పంపించేందుకు భయపడిపోయారు. వారి బాధను చూసిన కుంతీదేవి.. తన కుమారుడు భీముడుతో ఆహారం బండిని పంపింది. ఆహారం బండితో వెల్లిన భీముడు బకాసురుడిని సంహరించాడు. అయితే బకాసురుడు ఒక బ్రాహ్మణ రాక్షసుడు కావడంతో భీముడుకి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. దీని నుంచి బయటపడేందుకు శివుని కోసం తపస్సు చేశాడు. అప్పుడే ఖర్గుపూర్ ప్రాంతంలో ఒక పెద్ద శివలింగాన్ని నల్లరాయితో తయారు చేసి ప్రతిష్టించాడని చెబుతారు. ఇది దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తు భూమిపైన ఉండగా.. భూమి లోపల 64 అడుగులు ఉందని చెబుతారు. పురావస్తు శాఖ పరిశోధనలో కూడా ఈ శివలింగం దాదాపు 6 వేల ఏళ్ల నాటిదని తేలింది.
