
ఆంజనేయస్వామిని వేడుకుంటే సమస్యను ఎదుర్కోగలిగే శక్తితో పాటు భయాలను తొలగిస్తాడని నమ్మకం. హనుమంతుడికి ఎన్నో స్వరూపాలున్నాయి. అవి ఎన్ని రకాలో తెలుసా? కార్యసిద్ధి హనుమ, సంజీవని హనుమ, పంచముఖ హనుమ, భక్తాంజనేయ, అభయాంజనేయ, దాసాంజనేయ వంటి పేర్లతో ఆంజనేయుడిని పిలుచుకుంటాం. అయితే ఈ రూపాలన్నింటిలో అభయాంజనేయస్వామి స్వరూపం అనేది అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు. ఈ అభయాంజనేయ స్వామి అన్నిరకాల భయాలతో పాటు దుష్ట గ్రహ పీడ తొలగించే స్వామిగా కొలుస్తారు.
ఒక మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడపలో ఉంది. ఈ ఆంజనేయుడిని ఆశ్రయిస్తే చాలు.. వెంటనే అన్ని భయాలను తొలగించి అభయాన్నిస్తాడట. ఆళ్లగడప గ్రామంలోకి ప్రవేశించగానే హనుమంతుడి ఆలయం కనిపిస్తుంది. ఆళ్లగడపను ఈ హనుమంతుడే దుష్టశక్తుల బారి నుంచి, అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాడని ఆ గ్రామస్తుల నమ్మకం. ఇది అతి ప్రాచీనమైన ఆలయం. ఈ గ్రామంలోని వారికి ఈ ఆంజనేయస్వామి కారణంగా కనీసం దుస్వప్నాలు సైతం రావట.
