మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో కలిసింద నది ఒడ్డున అగర్-మాల్వాలోని నల్ఖేడా గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో గడియా గ్రామానికి సమీపంలో ఉన్న గడియాఘాట్ వలీ మాతాజీ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయంలోని దీపం నీటితో వెలుగుతుందని చెప్పుకున్నాం. కలిసింద నది నుంచి నీటిని తీసుకొచ్చి దీపంలో పోయగానే నీరు చిక్కని ద్రవంలా మారుతుంది. అప్పుడు దీపం వెలిగిస్తే చక్కగా వెలుగుతుంది. తొలినాళ్లలో ఈ ఆలయంలోని దీపాన్ని ఇతర దేవాలయాల మాదిరిగా నూనె, నెయ్యితో వెలిగించే వారట. అయితే ఒకరోజు అమ్మవారు ఆలయ పూజారికి కలలో కనిపించి నది నీటితో దీపాలు వెలిగించమని చెప్పిందట.
అమ్మవారు చెప్పిన ప్రకారమే తరువాతి రోజు పూజారి చేశాడట. దీపంలో నది నీటిని నింపి వత్తిని వెలిగించిన వెంటనే దీపం వెలగడం మొదలు పెట్టిందట. ఇక అప్పటి నుంచి ఆలయంలోని దీపాలు నది నీటితోనే వెలిగించడం జరుగుతోందని స్థానికులు చెబుతారు. ఈ అద్భుతం గురించి ఆ నోటా ఈ నోటా పడి చుట్టుపక్కల ప్రాంతాల వారికి అలా దాదాపు దేశమంతా పాకింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. వర్షాకాలంలో ఒకరోజు ఆలయంలో దీపం వెలగలేదట. వర్షానికి కలిసింద నది నీటి మట్టం పెరగడంతో ఆలయం నీటిలో మునిగి పూజారులకు వెళ్లేందుకు అవలేదట. ఆ తరువాత శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయట. అప్పుడే ఆలయంలో మళ్లీ అఖండ జ్యోతిని వెలిగిస్తారట. అది తిరిగి వర్షాకాలం వచ్చే వరకూ వెలుగుతూనే ఉంటుందట.