తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు శుభవార్త చెప్పారు. తిరుమలకు వెళ్లిన తర్వాతే కాదు.. తిరుమల కొండ ఎక్కే క్రమంలోనూ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ఈవో ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు తిరుపతి నుంచి కొండపైకి వెళ్లాలన్నా.. కొండ దిగాలన్నా.. లేదంటే కొండపై ఎటు వెళ్లాలన్నా కూడా జీపుల వారు రవాణా ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపై టీటీడీ దృష్టి సారించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే క్రమంలో చాలా వ్యయ ప్రయాసలను భక్తులు భరించాల్సి వస్తోంది.

తిరుమలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. తమ సొంత వాహనాల్లో భక్తులు తిరుమలకు వస్తే పర్వాలేదు కానీ కొందరు ఆర్టీసీ బస్సులు, రైళ్ల ద్వారా తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమలకు స్థానిక వాహనాలను ఆశ్రయిస్తారు. స్థానిక జీపులను ఆశ్రయిస్తే జేబులు గుల్ల అవుతూ ఉంటాయి. ఇదే అదనుగా భావించి పెద్ద ఎత్తున భక్తుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలన్న ఆలోచనకు టీటీడీ వచ్చింది. ఇకపై ప్రైవేటు వాహనదారులు ఎక్కువ మొత్తంలో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ 12 ధర్మ రథాలను నడుపుతున్నా కూడా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. త్వరలోనే మరిన్ని వాహనాలకు తిరుమలకు తెప్పిస్తామని టీటీడీ ఈవో పేర్కొన్నారు.

Share this post with your friends