తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఇవాళ రాత్రి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ తెప్పోత్సవాలు ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 13వ తేదీ వరకూ జరగనున్నాయి. ఇవాళ రాత్రి స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేయనున్నారు. ప్రతి ఏటా శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు జరగడం ఆనవాయితీ. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమై తెప్పోత్సవాలు పౌర్ణమి వరకూ జరుగుతాయి.
తెప్పోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెప్ప చుట్టూ షవర్స్ ఏర్పాటు చేశారు. తెపోత్సవాల అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగించడంతో పాటు గజ ఈతగాళ్లను సైతం అందుబాటులో ఉంచారు. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడమే తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవాలు ఈనాటివి కావు. ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 09, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.