ఒరిస్సాలోని పూరి జగన్నాథుని ఆలయంలోని వింతల్లో ఒకటైన మూడవ మెట్టు గురించి ముందే చెప్పుకున్నాం. అసలు ఈ మూడవ మెట్టుపై అడుగు పెడితే యమలోకంలో బెర్త్ కన్ఫర్మ్ అని ఎందుకంటారు? ఈ మూడవ మెట్టుపై అడుగు పెడితే యమలోకం ఎందుకు ప్రాప్తిస్తుంది? అనే దానికి ఒక కథ ఉంది. అదేంటో చూద్దాం. ఒకసారి జగన్నాథుడిని కలిసిన యమ ధర్మరాజు.. స్వామీ.. నిన్ను దర్శించుకున్న వారందరికీ పాపాలు నశించి మోక్ష ప్రాప్తి కలుగుతోంది. దీంతో యమ లోకం వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదని చెప్పాడట. యమలోకం ఉనికికే దీని వల్ల ప్రమాదం వాటిల్లుతోంది కాబట్టి ఏమైనా చేయాలంటూ వేడుకున్నాడట.
యముడి బాధను విన్న జగన్నాథుడు.. యముడిని సముదాయించి ఇక నుంచి నా ఆలయ ప్రధాన ద్వారం నుంచి గర్భగుడి వైపునకు వచ్చే మూడవ మెట్టు మీద నువ్వు ఆశీనుడివి అవ్వమని చెప్పాడట. తనను దర్శించుకోవడానికి కానీ.. తనను దర్శించుకుని కానీ వెళుతూ భక్తులు ఎవరైనా ఆ మూడవ మెట్టుపై అడుగు పెడితే వారి పుణ్యమంతా నశించి యమలోకానికి వస్తారని చెప్పాడట. జగన్నాథుడు అలా చెప్పడంతో వెంటనే వెళ్లి యముడు మూడవ మెట్టుపై సెటిల్ అయ్యాడట. మరో కథ కూడా ఉంది. ఈ మూడవ మెట్టుపై జగన్నాథుని సోదరి సుభద్రాదేవి నివాసమట. దేవత నివాసాన్ని కాలితో తాకడం అగౌరవం కాబట్టి భక్తులు పొరపాటున కూడా మూడో మెట్టుపై అడుగు పెట్టకూడదని అంటారు.