ఆ మాటలతో వకుళమాత శ్రీనివాసుని మెడలో తులసి మాలగా మారిందట..

వకుళా దేవి విష్ణు మూర్తి రూపమైన వేంకటేశ్వరుని పెంపుడు తల్లి. తిరుమల పురాణం ప్రకారం వకుళాదేవి కథ ద్వాపర యుగం నాటిది. పురాణంలో విష్ణు మూర్తి అవతారమైన శ్రీ కృష్ణుడిని యశోద పెంచిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆమె శ్రీకృష్ణుడి వివాహాలలో దేనినీ చూడలేదట. ఈ విషయమై కుమారుడికి యశోద మొరపెట్టుకుందట. దీంతో తాను కలియుగంలో ఆ అవకాశం నీకు ఇస్తానని మాటిచ్చాడు శ్రీకృష్ణడు. కలియుగంలో విష్ణుమూర్తి వేంకటేశ్వరుని రూపాన్ని ధరించాడు. యశోద వేంకటేశ్వరుని పెంపుడు తల్లి వకుళ దేవిగా పునర్జన్మ పొందింది. ద్వాపరయయుగంలో శ్రీకృష్ణుడి వాగ్దానం కలియుగంలో నెరవేరింది. వకుళమాత తన పెంపుడు కుమారుడైన వేంకటేశ్వరుని వివాహాన్ని ఆకాశరాజు, ధరణిరాణి కుమార్తె పద్మావతితో జరిపించింది.

వనవిహారమునకు వెళ్ళిన శ్రీనివాసుడు, పద్మావతి ఎంతసేపటికి కుటీరమునకు రాలేదట. తన కుమారుడు, కోడలికి ఏమైందో తెలియక ఆందోళనతో పెద్దకుమారుడైన గోవిందరాజస్వామిని వెంటబెట్టుకొని వకుళమాత ఆనందనిలయమును సమీపించిందట. అక్కడ శిలగా మారిన శ్రీనివాసుని చూసి ఆందోళనతో ‘నాయనా! శ్రీనివాసా!’ అని గట్టిగా అరిచిందట. శిలలో నుంచి వకుళ మాతకు కొన్ని మాటలు వినిపించాయట. అవేంటంటే… “జననీ! నీకు ముక్తి ప్రసాదించుచున్నాను. నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు” అని వినిపించిందట. దీంతో వకుళామాత తులసిమాలగా మారిపోయి శ్రీనివాసుని కంఠమున చేరిందట. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తులసిదళములతో పూజిస్తారు. ఆయనకు కూడా తులసీ దళములంటే అత్యంత ప్రీతి.

Share this post with your friends