హిందూ మత విశ్వాసాల ప్రకారం, భగవంతుడిని ఆరాధించడం పూర్తయిన తర్వాత తప్పక తీర్థం తీసుకుంటాం. అలా తీర్థం తీసుకోకుండా వస్తే మనసు నొచ్చుకుంటుంది. చాలా మందికి తీర్థం ఎందుకు తీసుకోవాలి? ఎన్ని సార్లు తీసుకోవాలి? వంటి విషయాలు తెలియవు. కానీ తప్పక తీసుకుంటారు. తీర్థాన్ని పవిత్ర జలంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఏ ఆలయానికి వెళ్లినా కూడా తీర్థం తీసుకుంటాం. ఇక తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర అంటే బొటనవేలితో చూపుడు వేలిని మూసేసి చివరి మూడు వేళ్లను ముందుకు చాచి తీసుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు ఇక ఎన్ని సార్లు తీసుకోవాలనే కదా మీ సందేహం? మూడు సార్లు తీసుకోవాలి.
మూడు సార్లు ఎందుకంటే.. తొలి తీర్థము మన శరీర శుద్ధి, శుచికి తోడ్పడుతుందట. రెండవ తీర్థం ధర్మ,న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు స్వీకరించాలట. ఇక తీర్థం తీసుకునే సమయంలో అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప ఉశమనం విష్ణుపాదోదకం శుభం అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇక మూడు సార్లు ఎవరు తీసుకోవాలంటే.. ఇంట్లో అన్నం తినే అవకాశం లేనివారు. అదే గుడికి వెళ్లినప్పుడు ఒకసారి మాత్రమే తీర్థాన్ని తీసుకోవాలి. ఇక కొన్నిసార్లు మనం ఉపవాసం ఉంటాం కదా.. ఏదైనా ప్రత్యేక రోజుల్లో అప్పుడు ఒకసారి.. ఉపవాసం చేసిన తర్వాతి రోజున సూర్యోదయం వేళ మరోసారి తీర్థం తీసుకుంటే.. మన ఉపవాసం ముగిసినట్టే.