హిందూ దేవుళ్లు చాలా మంది ఉన్నారు. దాదాపు అందరికీ ప్రతి ఏటా వివాహం జరుగుతూనే ఉంటుంది. అయితే ఏ దేవుడి కల్యాణానికి దర్కని వైభవం, విశిష్టత సీతారాముల కల్యాణానికి మాత్రమే దక్కుతుంది. ఎందుకలా? అంటే దీనికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరాముడు, సీతాదేవి యజ్ఞ ఫలితంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దశరథ మహారాజు చేసిన యాగ ఫలితంగా శ్రీరాముడు జన్మించాడు. అలాగే జనక మహాయాజు యాగం కోసం భూమిని తవ్వుతుండగా నాగటి చాలు ద్వారా సీతమ్మ తల్లి లభించింది. రామయ్య, సీతమ్మలిద్దరూ యాగ ఫలితంగా లభించారు కాబట్టి వారి కల్యాణానికి అంత ప్రాధాన్యమట.
శ్రీరామనవమిని లోక కల్యాణం అని సంకల్పంలో పండితులు సైతం చదువుతుంటారు. కొత్తగా పెళ్లైన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు. గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించి తిథి.. నక్షత్రంలోనే వివాహం జరిపించాలని శాస్త్రం చెబుతోంది. అందుకే శ్రీ సీతారాముల కల్యాణాన్ని రాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రంలో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లోకోత్తర కల్యాణం లోక కళ్యాణ యజ్ఞానికి హేతువని శాస్త్రాల్లో వివరించడం జరిగింది. ఈ నెల 17న రాముల వారి కల్యాణం అంగరంగా వైభవంగా జరుగనుంది.