పూరాణ కాలంలో నరకాసురుడు అనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను అహంకారంతో స్వర్గంలోనూ, భూమిపైన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేశాడు. నరకాసురుడి వలన మానవులే కాదు.. దేవతలంతా చాలా ఇబ్బంది పడ్డారు. నరకాసురుడు తన అహంకారంతో రాజులతో పాటు 16వేల మంది రాకుమార్తెలను బంధించి వారిని వివాహం చేసుకోవానుకున్నాడు. నరకాసురుడి దుశ్చర్యలతో కలత చెందిన ఇంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడి వద్దకు వెళ్లి నరకాసురుడి బారి నుంచి తమను రక్షించాలని కోరాడు.
అయితే నరకాసురుడికి మరణం ఒక స్త్రీ చేతిలో ఉందన్న శాపం ఉంది. ఈ శాపం గురించి శ్రీకృష్ణుడికి తెలుసు.. కాబట్టి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధానికి వెళ్లాడు. సత్యభామ రథసారధిగా ముందుగా కృష్ణుడితో యుద్ధానికి నరకాసురుని కుమారులు వచ్చారు. వారితో పాటు ముర అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించిన తర్వాత నరకాసురుడు యుద్ధరంగంలోకి దిగాడు. అప్పుడు నరకాసురుడి బాణానికి శ్రీకృష్ణుడు మూర్చబోయినట్టుగా నటించగా సత్యభామ విల్లందుకుని నరకాసురుడిని సంహరించింది. నరకాసురుడిని
వధించిన రోజు ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి కనుక ఈ తిధిని నరక చతుర్దశి అంటారు. నరకాసుర వధ కారణంగా ఆనందంతో ప్రజలంతా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. నాటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది.