ఈ నెల 21న గురు పౌర్ణమి జరుపుకోనున్న విషయం తెలిసిందే. తల్లి, తండ్రి తర్వాత మనం గురువుకే పెద్ద పీట వేస్తాం. అసలు ఈ గురు పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటాం అంటే.. ఆది గురువైన వ్యాసుని జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం. ద్వాపర యుగంలో పరాశరుడు, సత్యవతి దంపతులకు వ్యాసుడు జన్మించాడు. గురు పౌర్ణమి రోజున పూజ ఎలా చేయాలంటే ఉదయాన్ని శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై లక్ష్మీనారాయణుల విగ్రహాలను దానిపై ఉంచాలి.
ఆ పీటపై కుల గురువు విగ్రహాన్ని సైతం పీటపై పెట్టి లక్ష్మీనారాయణుల అష్టోత్తర శతనామాలను పఠించాటి. తరువాత గురు పరంపరను, గురు శ్లోకాలను భక్తితో పఠించాలి. పూజలో వీలైనంత మేర పసుపు రంగుకు సంబంధించిన వాటిని మాత్రమే వాడాలి. పసుపు రంగును గురువుకు సంకేతంగా భావిస్తూ ఉంటారు. పసుపు రంగు పూలు, పండ్లు, ప్రసాదాలు సైతం పసుపు రంగులోనే ఉండాలి. గురు పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. దీనికి కారణం లక్ష్మీనారాయణుల స్వరూపమే సత్యనారాయణ స్వామి అని అంటారు. అనంతరం గురువు ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిదట.