ఈ నెల 19న రాఖీ పండుగను జరుపుకోనున్నాం. ఆ రోజున భద్ర నీడ వస్తుందని తెలుసుకున్నాం. ఈ భద్ర నీడ అనేది 19న మధ్యాహం 12:30 వరకూ ఉండనుంది. ఆ తరువాత కూడా మరో గంట పాటు భద్ర నీడ ప్రభావం ఉండనుంది. కాబట్టి ఆసమయంలో రాఖీని కట్టకూడదని తెలుసుకున్నాం. అసలు భద్ర నీడ అంటే ఏంటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇదొక ప్రత్యేకమైన సమయం. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కానీ.. పనులు కానీ చేయరు. చేసినా మంచి జరగదని అంటారు.
భద్ర కాలాన్ని విష్టి కరణం అంటారు. కాబట్టి ఈ సమయంలో చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వవట. పురాణాల ప్రకారమైతే భద్ర సూర్య భగవానుడు, ఛాయ దేవి దంపతుల కుమార్తె. సాక్షాత్తు శనీశ్వరుడి సోదరి. ఛాయా దేవి అపర శివ భక్తురాలు. శివుడి అనుగ్రహం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో తపస్సు చేసింది. కుమార్తెకు అద్వితీయమైన శక్తులు ఉండేలా శివయ్య నుంచి వరం పొందింది. ఈ వరం కారణంగా భద్ర జన్మించింది. ఈ వర ప్రభావంతో భద్రకు శక్తివంతమైన ప్రత్యేక శక్తులు వచ్చాయి. భద్ర స్వభావం క్రూరమైనది. ఒకరికి హాని చేయడంలో ముందుంటుంది. అందుకే ఈ సమయంలో ఏ పనులు చేసినా సక్సెస్ కావట.