తథాస్తు… మూడక్షరాల ముచ్చటైన దీవెన. దేవతలు మెచ్చి మనుషులకు ఇచ్చే అపురూపమైన కానుక. కష్టనష్టాల నుండి కాపాడమని, కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం. ఆకాశానికి, అంతరాళానికి నడుమ త్రిశంకువులా ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో, శాపమో తేల్చడం సాధ్యం కాదు. ఊగుతూ ఉన్నచోటే ఉండిపోవడం కన్నా, ముందుకు సాగిపోవడమే ఉత్తమం అన్న భావన కొందరిని స్థిరంగా ఉండనివ్వదు. మనిషి అటు స్వర్గానికీ, ఇటు నరకానికీ కాకుండా మధ్యలో వేలాడటానికి కారణం లేకపోలేదు. పైవారికి (దేవతలకు) చావు లేదు. కింది వారికి (దానవులకు) చావంటే భయం లేదు. మధ్యస్థుడైన మనిషికే చావు తప్పదు.

అందుకే చావంటే మనిషికి అంత భయం. మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ, నూరు శాతం మంచివాడని కానీ చెప్పలేం. కాకపోతే, దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు. సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు. ఏదో ఒక రోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు. అందుకు మానవ ప్రయత్నం అవసరం. అది సఫలం కావడానికి దైవబలం కూడా తోడు కావాలి. చిత్తశుద్ధితో, బుద్ధిని ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైనా యోగసిద్ధుడుగా మారవచ్చు. అందుకు పెట్టుబడి పట్టుదల, అవిరళ కృషి మాత్రమే. పట్టు వదలని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవి అనుగ్రహం పొందాడు. మనం తలవకపోయినా, కొలవకపోయినా, పైనుంచి అదృశ్య శక్తులు మనల్ని వీక్షిస్తూనే ఉంటాయని పెద్దలు అంటారు. చెడు పనులు, చెడు భావనలు చేయకూడదన్న కట్టుబాటు ప్రగతికి దారిదీపం లాంటిది. మానవుడి అంతర్యామి శుద్ధి కావాలి.
‘తథాస్తు’ దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రాచీన గ్రీకు దేశస్థులు దారిచూపే దేవతలను ‘ఎగ్రిగోర్స్’ అని పిలిచేవారు. యుద్ధరంగానికి బయలుదేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు. శుభకార్యాలు నిరాటంకంగా జరగాలని, ముందుగానే వారికి మొక్కుబళ్లు చెల్లించేవారు. ఇలాంటి సంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్న ఉపనిషత్తుల మహావాక్యం జాతి హృదయంలో సుస్థిరమైంది. ఈ ప్రపంచంలోని జడ, జీవ పదార్థాలను ఒక వాస్తవం శాసిస్తోంది. ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే, కార్యం వెనుక కారణం ఉంటుంది. భావమే బాహ్యరూపంలో జీవితాన్ని నడిపిస్తుంది. సదాచార, సద్విచారాలే మోక్ష ద్వారాలు. కొన్ని ఆకృతులు కంటికి కనిపించకపోయినా మనసును అలరిస్తాయి, కలవరపాటుకు గురిచేస్తాయి. పంచభూతాలు అందరికీ సమానంగా తమ శక్తులను పంచుతాయి. ప్రతిఫలం ఆశించవు. అలాగే మనం కూడా ప్రతిఫలం కోరకుండా పనులు చేస్తే, దేవతలు తప్పకుండా మెచ్చి ‘తథాస్తు’ అని దీవిస్తారు
