భారతదేశంలో ఆలయం లేని ఊరంటూ ఉండదు. నగరం నుంచి కుగ్రామం వరకూ అన్ని చోట్ల ఏదో ఒక దేవతకు సంబంధించిన ఆలయం ఉంటుంది. ఈ క్రమంలోనే నవగ్రహాలకు సైతం ఆలయాలున్నాయని తెలుసా? చాలా ఆలయాల్లో నవగ్రహలు ఉంటాయి. కానీ ఒక్కో గ్రహానికి ఒక్కో ఆలయం కూడా ఉంది. ఈ క్రమంలోనే అంగారకుడిని ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం. అరుణ గ్రహంగా పిలుచుకునే అంగారకుడికి చాలా మందిరాలు ఉన్నాయి. వాటిలో ఉజ్జయినిలోని ఆలయం చాలా ప్రత్యేమైనది. ఇది ఎందుకంత ప్రత్యేకమో తెలుసా? ఉజ్జయిని అంగారకుడి పుట్టిల్లట. అందుకే అంత ప్రత్యేకం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయినిని ఆధ్యాత్మిక రాజధాని అని పిలుస్తారు. ఇక్కడే అంగారక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మంగళనాథ్ మందిరమని కూడా అక్కడి వారు అంటారు. మత్స్య పురాణం, స్కంద పురాణం ప్రకారమైతే ఉజ్జయినిలోనే అంగారకుడు జన్మించాడట. అందుకే ఉజ్జయిని నగరాన్ని అంగారకుని మాతృమూర్తి అని కూడా పిలుస్తారట. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఈ ఆలయానికి సరిగ్గా పై భాగంలో ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని అక్కడి వారంతా నమ్ముతారు. ఉజ్జయిని మంగళనాథ్ ఆలయంలో అంగారకుడిని శివుడి రూపంలో పూజిస్తారు. ఇక్కడి శివయ్యను పూజిస్తే జాతకంలో కుజ దోషం ఉంటే తప్పక పోతుందట.