యోగినీ ఏకాదశి, దేవశయన ఏకాదశి ఎప్పుడు? వీటి ప్రత్యేకతేంటి?

హిందూ మతంలో ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసముండి శ్రీహరిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. అయితే ప్రతి నెలా రెండు సార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు. కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది.. శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది. ఇవి రెండూ వేటికవే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యోగినీ ఏకాదశి ఉపవాసాన్ని నిర్జల ఏకాదశి తర్వాత .. తొలి ఏకాదశికి ముందు దేవశయని ఏకాదశిని ఆచరిస్తారు. అసలు యోగిని ఏకాదశి ఎప్పుడు నిర్వహిస్తారు? ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందంటారా? జేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశి నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 2న యోగినీ ఏకాదశి వచ్చింది.

ముఖ్యంగా ఎలాంటి వ్యాధి అయినా ఈ రోజున ఉపవాసం ఉంటే నయమవుతుందట. కుష్టు వ్యాధి కూడా ఈ రోజున ఉపవాసం చేస్తే నయమవుతుందట. అలాగే ఎలాంటి చర్మ సంబంధిత సమస్య అయినా పోతుందట. ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రకాల వ్యాధులతో పాటు గత జన్మ పాపాలను, చెడు పనుల వలన కలిగే దోషాలను సైతం తొలగిస్తుంది. ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున దేవశయని ఏకాదశి ఉపవాసం ఉంటారు. ఆ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లాడని నమ్మకం. దేవశయని ఏకాదశి రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణు మూర్తి యోగ నిద్రలో ఉంటాడట. తిరిగి ఆయన ఏకాదశి రోజున మేల్కొంటాడట. ఇక దేవశయన ఏకాదశిని ఈ ఏడాది జూలై 17న జరుపుకోనున్నాం.

Share this post with your friends