సూర్యభగవానుని కుమారుడైన శని దేవుడి పుట్టిన రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున చేసే పూజలు, పరిహారాలు ఆయనకు చాలా సంతృప్తినిస్తాయట. ముఖ్యంగా ఏలిన నాటి శని ప్రభావంతో బాధపడేవారు పరిహారాలు, పూజలు చేసుకుంటే చాలా వరకూ ఉపశమనం లభిస్తుందట. మరి శని జయంతి ఎప్పుడు? అంటే ఆసక్తికరంగా శని జయంతిని ఏడాదికి రెండు సార్లు జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో శని జయంతిని వైశాఖ అమావాస్య నాడు జరుపుకుంటే మరికొన్ని రాష్ట్రాల్లో జ్యేష్ఠ మాస అమావాస్య నాడు జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది వైశాఖ అమావాస్య మే 8న, జ్యేష్ఠ అమావాస్య జూన్ 6న రానున్నాయి.
ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా శని జయంతి జరుపుకోవచ్చు. ఆ రోజున మాత్రం ఎలాంటి పొరపాట్లు లేకుండా శనిదేవుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఏవైనా పొరపాట్లు చేస్తే.. శని దేవుడి అసంతృప్తికి గురవుతామట. తద్వారా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మరింత ఎక్కవవుతాయని అంటున్నారు. ఇక శని జయంతి రోజున ఏం చేయకూడదో చూద్దాం. శని పూజలో రాగి పాత్రలను అస్సలు వినియోగించవద్దు. శని దేవుడి విగ్రహానికి ముందు నిలబడి కళ్లలోకి చూడవద్దు. కొంచెం దూరంగా నిలబడాలి. అలాగే ఈ రోజున ఉప్పు, ఇనుము, నూనె కొనకూడదు. ఈ రోజున ఏ పక్షినీ వేధించవద్దు. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి.