హిందువులకు ప్రతి మాసంలోనూ పర్వదినాలు చాలా ఉంటాయి. వాటిలో ఇందిరా ఏకాదశి ఒకటి. భాద్రపద పక్ష మాసంలో ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనినే ఇందిరా ఏకాదశి అని కూడా అంటారు. ఇది విష్ణుమూర్తికి అంకితం చేయబడినది కాబట్టి ఈ రోజున ఉపవాసం చేయడం వలన పుణ్యంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ ఇందిరా ఏకాదశి ఉపవాసాన్ని ప్రతి ఏడాది భాద్రపద పక్ష మాసంలో ( ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం) ఏకాదశి నాడు ఆచరిస్తారు.
అంటే ఈ ఏడాది మనం ఇందిరా ఏకాదశిని ఎప్పుడు జరుపుకోనున్నాం? ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. ఈ ఏడాది ఏకాదశి తిథి సెప్టెంబర్ 27న శుక్రవారం మధ్యాహ్నం 01:20 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 28న శనివారం మధ్యాహ్నం 02:49 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం మనం ఇందిరా ఏకాదశి ఉపవాసాన్ని ఈ నెల 28, శనివారం నాడు జరుపుకోనున్నాం. ఇక ఉపవాస దీక్ష 28న ప్రారంభమై 29న ముగియనుంది. ఇక పూజకు అనుకూలమైన సమయం ఎప్పుడంటే.. 28న ఉదయం 05:23 నుంచి మధ్యాహ్నం 02:52 వరకూ చేసుకోవచ్చు.