
అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అనే మూడు మతాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ మూడు ఆరాధనా మార్గములకూ ప్రబలమైన సాహిత్యమూ, సంప్రదాయమూ ఉన్నాయి. వాటికి అంకితమైన భక్తజనం కూడా అశేషంగా ఉన్నారు. ఇక్కడ గుర్తించవలసిన విషయమేమంటే మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి. ముగ్గురు సిద్ధాంతకర్తలూ అసాధారణ పండితులు. తమ భాష్యాలతోనూ, వాదాలతోనూ సమకాలీన పండితులను మెప్పించి, ప్రతివాదులను ఓడించి తమ సిద్ధాంతములకు గుర్తింపు, మన్నన సాధించారు. మూడు సిద్ధాంతాల ప్రావిర్భావమూ హిందూమతంలో సత్యశోధనకూ, పాండిత్యానికీ ఉన్న గుర్తింపు.
అద్వైతం: ఇది ఆదిశంకరులుగా ప్రసిద్ధులైన శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన సిద్ధాంతము. మూడింటిలోను మొదటిది. హిందూమతముపై అత్యంత ప్రభావము కలిగిన ఆలోచనా మార్గములలో ఇది ఒకటి. బ్రహ్మమొకటే సత్యము. మిగిలినదంతా మిధ్య. జీవాత్మకు, పరమాత్మకు (బ్రహ్మమునకు) భేదము లేదు. అలాగే అందరిలోని ఆత్మ బ్రహ్మమయమే. మాయవలన అజ్ఙానము, దాని వలన భేద భావము కలుగుతుంది. తాడును చూసి పామని భ్రమించిన వాడికి భయం కలుగుతుంది. అది తాడు అని తెలియగానే భయము తొలగిపోయి.. జ్ఞానం వల్ల మాయను అధిగమించి, మోక్షము పొందుట సాధ్యమవుతుంది.
