శ్రీకృష్ణుడు నడయాడిన ద్వార ఆయన నిర్యాణం తరువాత నీట మునిగిన విషయాన్ని తెలుసుకున్నాం కదా. కన్నయ్య నిర్యాణం తరువాత ద్వారకను భారీ ప్రళయం ముంచెత్తిందట. ప్రళయానికి ముందు భారీగా గాలులు వీచాయి. నివాసాల్లోని మట్టి పాత్రలన్నీ ఆ భారీ గాలులకు వాటంతట అవే పగిలిపోయాయట. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని శ్రీకృష్ణుడు గ్రహించాడట. వెంటనే అర్జునుని ద్వారకకు పిలిపించాడట. ద్వారక సముద్రంలో మునిగిపోనుందని చెప్పి అక్కడి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు.
శ్రీకృష్ణుడి సూచన మేరకు తక్షణమే స్పందించిన అర్జునుడు ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడట. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడట. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడి కళ్ల ముందే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఇదంతా క్రీ.పూ.1443లో జరిగిందని చెబుతారు. అందమైన, అద్భుతమైన ద్వారకాపురి సాగరగర్భంలో కలిసిపోయిందని చరిత్రకారులు సైతం చెబుతున్నారు.