
ముగ్గురు మకుటం లేని మహారాజులూ త్యాగరాజు, గోపరాజు, పోతరాజులు రాచరికాన్ని విడిచిపెట్టారు. ఆ పరంపరలో ఒక రాజు దాసుడయ్యాడు. అతడే రామదాసుగా మారిన గోపరాజు. ఆయన తన కీర్తనల్లో ‘రామజోగి మందు కొనరే…’ అనే కీర్తనలో ‘శ్రీరామ దివ్య నామస్మరణ అనే పానం చెయ్యండి’ అన్నాడు. మరోచోట ‘తారక నామమనే రసాన్ని పానం చేసేవారికి అమృతాన్ని తాగే అవసరం లేదు’ అన్నాడు. మరో రాజు అయ్య (తండ్రి)గా మారి త్యాగయ్య అయ్యారు. ఆయనా తన కీర్తనల్లో చాలాచోట్ల ‘దైవ నామ పానం చెయ్యండి’ అని ప్రయోగించారు. పోతరాజు ‘పోతన్న’ పేరుతో అందరికీ అన్న అయ్యారు.
ఆయన తన భాగవత అనువాదంలో అనేకచోట్ల నామపానం అనే ప్రయోగం చేశారు. ప్రహ్లాదుడి గురించి చెబుతూ, నారాయణుడి పాదపద్మాల గురించి ఆలోచించడమనే అమృత పానం చేసేవాడు- అని ప్రయోగించారు. ‘మందార మకరంద…’ అనే పద్యంలో విష్ణు పాదాల గురించి ఆలోచనలనే అమృతాన్ని గ్రోలేవాడు అని ప్రయోగించారు. ఇలా ఆ ముగ్గురూ పరమేశ్వరుడి పాదాల దగ్గర దాస్యాన్నే అభిలషించారు. భక్తి అనే రసం పంచారు. భక్తి సామ్రాజ్యాలను ఏలారు. సదాశివ బ్రహ్మేంద్రులవారు ‘పిబరే రామరసం’ అంటూ రామ నామమనే రసాన్ని పానం చెయ్యండన్నారు. ఇలా విష్ణునామ సంకీర్తనలు చేసినవారంతా పానం చెయ్యమనే చెప్పారు.
