శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏం చేస్తే విశేష ఫలితం దక్కుతుంది?

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యను పూజిస్తే తప్పక ఆయన ఆశీస్సులు పొందుతామని నమ్మకం. అందుకే అంతా కృష్ణాష్టమి పండుగను వైభవంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి వేణు మాధవుని ఆశీస్సుల కోసం ఏం చేయాలి? అంటే ఆ రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కన్నయ్యకు వేణువంటే చాలా ఇష్టం. అందుకే ఆయనను మురళీధరుడని కూడా అంటారు. అలాగే కన్నయ్యకు వెన్న, కండ చెక్కెరను నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాది లోపు చిన్నారులకు తినిపిస్తే పిల్లలకు చాలా మంచిదట.

ఇక నైవేద్యం లేనిదే శ్రీకృష్ణాష్టమి రోజున పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు. నైవేద్యంగా కన్నయ్యకు ఇష్టమైన వాటితో పాటు వేరే ఏం సమర్పించినా కూడా తప్పక తులసీ దళాన్ని సైతం నైవేద్యంతో పాటు సమర్పించాలట. శ్రీకృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టమట. దీనిని పండుగ పూట సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది. అలాగే కృష్ణాష్టమి రోజున కన్నయ్యకు, బలరాముడికి రాఖీలు కట్టాలట. అలాగే మల్లె, పారిజాతం, దేవగాని వంటి పువ్వులను సమర్పించాలట. శ్రీ కృష్ణాష్టమి రోజున దాన, ధర్మాలు చేసినా చాలా మంచి ఫలితం ఉంటుందట. స్తోమత మేరకు పండ్లు, ధాన్యం, బట్టలను దానం చేయాలట.

Share this post with your friends