మహర్షి వేదవ్యాసుని పుట్టినరోజును మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం. గురు పౌర్ణమి రోజున మనం గురువునే కాకుండా చంద్రుడిని కూడా ఆరాధించుకుంటూ ఉంటాం. చంద్రోదయానంతరం చంద్రుడిని పూజించి ఆపై అర్ఘం ఇవ్వడం వలన జాతకంలో చంద్ర దోషం ఏమైనా ఉంటే దాని నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. అలాగే తప్పక ఈ రోజున గురు పూర్ణిమ కథ చదివితే చాలా మంచిదట. మహర్షి వేదవ్యాసుడు శ్రీ మహా విష్ణువు అంశగా భావిస్తూ ఉంటారు. పరాశరుడు, సత్యవతిల కుమారుడే వేద వ్యాసుడు.
చిన్నతనం నుంచే వేదవ్యాసుడు ఆధ్మాత్మిక భావనను అలవరుచుకున్నాడు. ఒకరోజు తనకు భగవంతుడిని చూడాలని ఉందని.. కాబట్టి అడవిలో తపస్సు చేసుకునేందుకు అనుమతి కోరాడు. తల్లి అందుకు అనుమతించలేదు. అయినా సరే.. వేదవ్యాసుడు మాత్రం అడవికి వెళ్లాలని భావించాడు. ఇదే విషయాన్ని మరోసారి తల్లికి వివరించడంతో ఆమె అనుమతించింది. కానీ ఇల్లు ఎప్పుడైనా గుర్తుకు వస్తే మాత్రం తిరిగి రమ్మని చెప్పింది. సరేనని వేదవ్యాసుడు అడవిలో తపస్సుకు వెళ్లాడు. అడవిలో కఠోర తపస్సును ఆచరించిన వ్యాసుడికి భగవంతుని ఆశీర్వాదం లభించింది. ఆ తరువాత ఆయన వేదాలు, మహాభారతం, 18 మహాపురాణాలు, బ్రహ్మ సూత్రాలను రచించాడు.