
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం రెండో రోజు వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే రంగం భవిష్యవాణి కార్యక్రమం పూర్తైంది. అమ్మవారి ఆలయం ముందు పచ్చికుండపై నిలుచొని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పింది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. తనకు భక్తులు చేస్తున్న ఉత్సవ కార్యక్రమాలతో సంతృప్తి చెందినట్టు భవిష్యవాణి చెప్పింది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకుంటానని తెలిపింది. ఇక ఈ కార్యక్రమానంతరం అందంగా ముస్తాబైన ఏనుగు అంబారీపై ఆలయ పురవీధుల్లో ఊరేగింపునకు మహంకాళి అమ్మవారు బయలుదేరారు.
మేళ తాళాలు చప్పుళ్ళ మధ్య పోత రాజుల విన్యాసాలతో అమ్మవారి ఊరేగింపు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారిణి ఒకరు స్టెప్పులేయడం అందరినీ ఆకట్టుకుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఐఏఎస్ అధికారిణి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్‌తో పాటు జోగిని శ్యామల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన రూపవతి అనే ఏనుగుపై అమ్మవారు అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయం ఇస్తున్నారు. మొత్తం ఆలయం చుట్టూ అమ్మవారిని అంబారీపై మూడు సార్లు ఊరేగిస్తారు.
