తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం, చరిత్ర, వాస్తుశిల్పం, విశిష్టత మరియు అనేక ఇతర సంబంధిత విశేషాలపై టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సవివరంగా సమీక్షించారు. సోమవారం సాయంత్రం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్ర, వైఖానస ఆగమ, జీయంగార్ వ్యవస్థ, వివిధ ఆచార వ్యవహారాలు, నిత్య, వార, మాస, వార్షిక సేవా కార్యక్రమాలు, సుప్రభాతం నుంచి ఏకాంతం వరకు ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామికి నిర్వహించే వివిధ కైంకర్యాలను సవివరంగా ఈవోకు వివరించారు.
తరువాత ఆయన ఉదయం సేవలు, విఐపి దర్శనం, సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, ఇతర దర్శనాలను కూడా సమీక్షించారు. భక్తులకు కల్పిస్తున్న వివిధ రకాల దర్శనాలు, ఇందుకు సంబంధించిన దర్శన సమయము, ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది తదితర అంశాలపై సవివరంగా తనకు నివేదిక పంపవలసిందిగా ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంను ఆయన ఆదేశించారు.
ఈవో తనిఖీలు :
అంతకుముందు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నారాయణగిరి షెడ్లను ఈఓ పరిశీలించారు. యాత్రికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం గురించి కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు. ఈ తనిఖీలో ఇద్దరు జేఈవోలతో పాటు సీవీఎస్‌వో శ్రీ నరసింహకిషోర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.