ఇవాళ మహిళలంతా వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారు. కొందరు మరో వ్రతం ఆచరిస్తున్నారు. అదేంటో తెలుసా? పుత్రదా ఏకాదశి. ఈ వ్రతం ఆచరించిన వారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఇది నిన్న అంటే ఆగస్టు 15న ఉదయం 10:27 గంటలకు ప్రారంభమై ఆగస్టు 16న ఉదయం 09:40 వరకూ ఉంది కాబట్టి అంతా ఈ రోజునే జరుపుకున్నారు. వరలక్ష్మీ వ్రతం మరో శుక్రవారం అయినా జరుపుకోవచ్చనుకునే వారు ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నారు.
భవిష్య పురాణం ప్రకారం పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడట. ధన, ధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా రాజ్యంలోని ప్రజలంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారట. కానీ రాజు గారికి మాత్రం ఓ లోటు ఉండేదట. అదే సంతానం లేకపోవడం. సంతానం కోసం మహిజిత్తు రాజు చేయని యాగమూ.. మొక్కని దేవుడూ లేడట. ఒకరోజు లోమశుడు అనే మహర్షి గురించి తెలుసుకుని రాజు తరుఫున ప్రజలంతా వెళ్లి ఆయనకు సంతాన భాగ్యం కలిగే మార్గం చెప్పమన్నారు. ప్రజల కోరికకు సంతసించిన లోమశుడు శ్రావణమాసంలో ఏకాదశినాడు వ్రతమాచరిస్తే సంతానం కలుగుతుందని చెప్పాడు. దీంతో రాజ దంపతులతో పాటు రాజ్యంలోని ప్రజలంతా వ్రతమాచరించారు. వ్రతానంతరం రాజుకు పుత్ర సంతానం కలిగింది. ఇక అప్పటి నుంచి శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు పుత్రదా ఏకాదశి నిర్వహించుకుంటూ వస్తున్నారు.