తిరుమలకు వెళ్లిన వారు తప్పనిసరిగా జాబాలి తీర్థానికి వెళ్లాలి. ఈ ఆలయం మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా పచ్చని చెట్లు, సెలయేరుల మధ్య ఉంటుంది. చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం గురించి స్కందపురాణంలో, వేంకటాచల మహత్యంలో ప్రస్తావించారు. ఇది తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే దారిలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ హనుమంతుడు వెలసి ఉన్నాడు. ఈ ఆలయం సమీపానికి వెళ్లే కొద్ది ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటుంది.
ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ ఒకటి ప్రాశస్త్యంలో ఉంది. జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయనారంభించాడు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జాబాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరుతాయి కాబట్టి జాబాలి తీర్థంగా పేరొందింది. అయోధ్య కాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్ దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాక్ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరించగా ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయుడు గర్భాలయంలో సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి వారి శిరస్సు పై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి.