చాలా మంది కార్తీక మాసమంతా పూజలు నిర్వహిస్తారు. అలా వీలు పడని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజైనా పూజ నిర్వహిస్తే పూర్తి పుణ్యఫలం లభిస్తుందట. మరి కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ తిథులు చాలా ముఖ్యమని చెప్పుకున్నాం కదా.. ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలు – పూర్తి పుణ్యఫలం లభిస్తుంది. ఇక కార్తీక మాసంలో పౌర్ణమి తిథి అత్యంత ప్రభావవంతమైనది. ఈ కార్తీక పౌర్ణమి నాడు మనం ఏం చేయాలో తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించిస్తే చాలా మంచిదట. ఆ తరువాత శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునెయ్యితో వెలిగించాలట. అలా చేస్తే సమస్త పాపాలూ భస్మీపటలమవుతాయట. ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారని నమ్మకం. అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు చెబుతున్నాయి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టు, ఉసిరిక చెట్టుని లక్ష్మీ నారాయణులుగా భావించి కల్యాణం చేయాలట. ఇలా చేస్తే చాలా మంచిదని చెబుతారు. ఈ మాసమంతా కార్తీక పురాణం చదివినా, విన్నా పుణ్యం లభిస్తుందట.