శ్రీరామనవమి పర్వదినానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సీతమ్మ వారి కోసం బంగారం, వెండితో నేసిన చీర సిద్ధమైంది. సీతమ్మ కోసం బంగారం, వెండి పోగులతో పట్టు చీరను సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు మగ్గంపై నేశాడు. ఆ చీరను భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి అందించనున్నాడు. ఇప్పుడే కాదు.. కొన్నేళ్లుగా సీతారాముల కల్యాణానికి హరి ప్రసాద్ తనే స్వయంగా నేసి చీరను అందిస్తూ వస్తున్నారు. ఇక ఈసారి చీరకు కొన్ని ప్రత్యేకలున్నాయి.
ఇక ఈసారి హరిప్రసాద్ నేసిన చీర ప్రత్యేకతలేంటంటే.. చీరపై సీతారాముల కల్యాణ దృశ్యం కనిపిస్తుంది. అలాగే చీర అంచుల్లో భద్రాద్రి ఆలయంలోని సీతారాముల ప్రతిరూపాలు కనిపిస్తాయి. అలాగే చీర బార్డర్ వచ్చేసి స్వామివారి శంఖు చకక్ర నామాలతో పాటు జై శ్రీరామ్ వచ్చేలా చీరను డిజైన్ చేశారు. ఈ చీర బరువు వచ్చేసి 800 గ్రాములు కాగా.. దీనిలో రెండు గ్రాముల బంగారాన్ని, 150 గ్రాముల వెండితో పాటు పట్టు దారాలను చీర నేతలో వినియోగించారు. అయోధ్యలోని బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం నాడు సైతం 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో చీరను నేసి… దానిని జనవరి 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా స్వామి వారి పాదాల చెంతకు హరిప్రసాద్ చేర్చడం విశేషం.