జగన్నాథుని రథయాత్రకు ముందు ప్రధాన ఆచారమైన ‘దేవ స్నాన పూర్ణిమ’ ఉంటుందని తెలుసుకున్నాం కదా.. ఆ తరువాత ఏం జరుగుతుంది? స్నాన ఆచారం పూర్తయిన తర్వాత జగన్నాథునికి సాధారణ వస్త్రధారణ చేశారు. ఆ తరువాత మరో ప్రధాన ఆచారాన్ని నిర్వహిస్తారు. అదేంటంటే.. జగన్నాథుడిని వినాయకుని రూపంలో ప్రత్యేకంగా అలంకరించడం. సహస్త్రధార స్నానం పూర్తైన తరువాత జగన్నాథ ఆలయంలో స్వామివారి దర్శనానికి ఎవ్వరినీ అనుమంతించారు. అసలు ఆలయ ప్రధాన గర్భగుడి తలుపులను మూసివేసి ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవరు. అలా 14 రోజుల పాటు చేస్తారు. ఈ 14 రోజులూ దేవుని విశ్రాంతి సమయంగా పరిగణిస్తూ ఉంటారు.
దీని వెనుక ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే.. 108 కుండలతో జగన్నాథుడికి, సుభద్రాదేవి, బలభద్రుడికి స్నానం చేయిస్తారు కాబట్టి వారికి జ్వరం వస్తుందట. అందుకే పూర్తిగా వారికి విశ్రాంతిని ఇస్తారు. ఈ కాలాన్ని ‘అనవాసర’ లేదా ‘అజ్ఞాతవాసం’ అని అంటారు. ఈ అజ్ఞాతవాసం 14 రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి గర్భగుడి తలుపులు తెరిచే సాహసాన్ని ఎవరూ చేయరు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తిథి నాడు 15వ రోజున ఆలయ తలుపులను తిరిగి తెరిచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. ఈ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలు కొత్త కన్నులు అందించే కార్యక్రమం నిర్వహిస్తారు. దీనిని నేత్రోత్సవమని పిలుస్తారు. ఆ తరువాత జగన్నాథుని రథ యాత్ర ప్రారంభమవుతుంది.