
పండరీపురం దగ్గరవున్న చంద్రభాగానది ఒడ్డున ‘పరమానంద యోగి’అనే పరమభక్తుడు ఉండేవాడు. అతడు అనునిత్యం పాండురంగని ధ్యానంలో తరిస్తూ ఉండేవాడు. ప్రతి ఉదయం ఆయన లేవగానే, ఇంటివద్ద కాలకృత్యాలు తీర్చుకుని, చంద్రభాగానదిలో స్నానమాచరించి, నది వొడ్డున నిలబడి భగవద్గీతలోని 700 శ్లోకాలను పఠిస్తూ ఉండేవాడు. ప్రతిశ్లోకం చివరన… ‘ఓం పాండురంగాయనమః’ అని పాండురంగనికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్ధించేవాడు. ఈ కార్యక్రమాన్ని పరమానంద యోగి, క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేసేవాడు.
ఒకరోజు ఆ యోగి ఉంటున్న గ్రామంలో భారీవర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది. ఆ సమయంలో, శాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు, ఆ గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ వర్తకుని వద్ద ఉన్న అమూల్యమైన శాలువాలు తడిసిపోయే ప్రమాదం ఉండడంతో తనకు వచ్చే అపారనష్టాన్ని తలుచుకుంటూ ఆ నష్ట నివారణకు ప్రతి ఇంటికీ వెళ్లి తనకు ఆరాత్రికి ఆశ్రయమివ్వమని కోరసాగాడు. అందరివీ చిన్న ఇళ్లే అవడం మూలాన ఎవరూ మన్నించలేదు. చాలా దిగులుతో వర్తకుడు పరమానంద యోగి ఉంటున్న చిన్న గుడిసెకు కూడా వచ్చి ఆశ్రయం అడిగాడు. వెంటనే పరమానంద లోపలికి రమ్మని ఆహ్వానించి గుడిసె మొత్తంలో నీళ్లుకారని కొద్ది ప్రదేశాన్ని చూపించి, అక్కడ ఆయన అమూల్యవస్త్రాలు పెట్టుకోమని చెప్పాడు.
ఆ చిన్న ప్రదేశంలోనే వర్షంవస్తే యోగి తడవకుండా పడుకునేది. అయినా ఆ సమయంలో తన అవసరం పట్టించుకోకుండా వ్యాపారికి ఆశ్రయమిచ్చాడు. ఉన్నంతలో ఆ వ్యాపారికి తినడానికి పెట్టాడు. ఆపై తానూ, ఆ వ్యాపారి, గుడిసెలో ఇంకొక ప్రక్క తడిగావున్న ప్రదేశంలోనే భగవన్నామ స్మరణ చేస్తూ తలదాచుకున్నారు. మరునాడు తెల్లవారుతూనే వర్షం తగ్గుముఖం పట్టింది. వ్యాపారి పరమానంద బయలుదేరుతూ, ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా, ‘మీరు నన్నూ, నా కుటుంబాన్ని, కష్టాల బారిన పడకుండా కాపాడారు. మీ ఋణం తీర్చుకోలేనిది. నా కృతజ్ఞతా సూచకంగా, ఈ శాలువా తమరికి బహూకరిస్తున్నాను. కాదనకండి’ అని ఒక అతి ఖరీదైన, సుందరమైన శాలువా యోగికి ఇచ్చి నమస్కరిస్తూ శలవు తీసుకున్నాడు.
ఆ శాలువాని కాదనకుండా అంగీకరించాడు పరమానంద యోగి. దానిని నడుముకు కట్టుకుని యథాప్రకారంగా నది ఒడ్డుకు వెళ్లి భగవద్గీత శ్లోకాలు వల్లెవేయడం ప్రారంభించాడు. అయితే నోరు దానిపని చేస్తున్నది గానీ, చేతులు మాత్రం, ఎక్కువసేపు జోడించి, పాండురంగని స్తుతించలేక పోతున్నాయి. ‘ఎక్కడ నడుముకు కట్టుకున్న ఆ అందమైన, ఖరీదైన శాలువా తడిసిపోతుందో, మరకలు పడతాయో’ అని మాటిమాటికీ, దానిని సర్దుకోవడమే సరిపోయింది. యోగికి శ్లోకాలమీద ధ్యాస కుదరడంలేదు. శ్లోకం చివర ‘ఓం నమో పాండురంగాయనమః’ అన్నాడో లేదో గమనించడం లేదు. ఈ విధంగా ఆరోజు ప్రార్ధన ముగిసింది. ఎంతో అసంతృప్తిగా అనిపించింది యోగికి. తాను చేసిన పొరపాటు అర్ధమై అపరాధనా భావం యోగిని ముంచెత్తింది.
తాను చేసిన ఘోరతప్పిదం తనకు అర్ధమై తనను తాను శిక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే దగ్గరలోని తన వరిపొలంలోకి వెళ్లి, నాగలిని ఆ శాలువాతో కట్టి, దానిని తన నడుముకు బిగించుకుని, పాండురంగని ధ్యానం చేస్తూ, ఆ వరిపొలం దున్నసాగాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి, తాను నాగలితో ముడివేసుకున్న శాలువాను విప్పి, ‘ఎవరు నిన్ను ఇంత ఘోరశిక్షకు గురిచేసారు?’ అని లాలనగా అడిగాడు. దానికి సమాధానంగా.. ‘‘బాబూ! నన్ను ఆపకు. నన్ను ఎవరూ శిక్షించలేదు. నన్ను ఆ పాండురంగడు శిక్షించే లోపే, నాకు నేనే ఈ శిక్ష వేసుకున్నాను’ అని చెప్పి మళ్ళీ శాలువా కట్టుకోబోయాడు. అందుకు ఆ బాలుడు, ‘అయితే, ఆ పాండురంగడే, నిన్ను ఆపితే ఆగుతావా?’ అని అంటూ, పాండురంగని రూపంలో ప్రత్యక్షమై, ‘నీలో ఏ తప్పిదము లేదు. నీకు ఏకొంచెం మమకార వాసనలు ఉన్నా, అవి ఈ నాటితో తీరిపోవడానికే, నీకు యీ శాలువా మీద మమకారం కలిగేటట్లు చేశాను. నీవు ఆ వ్యాపారి నుంచి, ఏమీ ఆశించకుండా అతనికి ఆశ్రయం ఇచ్చావని నాకు తెలుసు పరమానందా! నీలో వున్న అపరాధ భావం యిప్పటితో, తొలగిపోయింది’ అని భుజం తట్టి పాండురంగడు అంతర్ధానమయ్యాడు. ఆనందాశ్రువులు వర్షిస్తుండగా, పరమానంద యోగి, పాండురంగని రూపాన్నే తలుచుకుంటూ, అక్కడే కూర్చుండి పోయాడు.
