పూరిలోని జగన్నాథుని రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా జగన్నాథుని రథయాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ముందు ఓ తంతు జరుగుతుంది. అదేంటంటే.. స్వామివారికి 108 కుండలతో స్నానం. దీనిని జేష్ట్య పౌర్ణమి రోజున దేవ స్నాన పూర్ణిమ పేరిట జూన్ 22న నిర్వహించడం జరిగింది. దీని కోసం 108 కుండలలో పవిత్ర జలం నింపి స్వామివారికి స్నానం చేయించారు. జగన్నాథుడితో పాటు అన్న బలభద్రుడు, సోదరి సుభద్రలకు సహస్త్ర ధార స్నాన ఆచారం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత హిందూ విశ్వాసం ప్రకారం 14 రోజుల పాటు స్వామిని భక్తులు దర్శనం చేసుకోలేరు.
అంటే మరో 12 రోజుల పాటు స్వామివారి దర్శనం ఉండదన్నమాట. జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి రోజున చేయించే సహస్త్రధార స్నానాన్ని ‘దేవ స్నాన పూర్ణిమ’ అని పిలుస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జగన్నాథుని రథయాత్రకు ముందు నిర్వహించే ప్రధాన ఆచారాలలో ఇది కూడా ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు ,సుభద్ర దేవిని స్నాన మండపానికి తీసుకొచ్చి ఆలయంలోని పవిత్ర బావిలోని నీటిని 108 కుండల తీసుకొచ్చి వాటిలో పూలు, గంధం, కుంకుమ, కస్తూరి వంటి వాటిని కలుపుతారు. ఇలా కలపడం వలన నీరు స్వచ్ఛంగానూ.. సువాసన భరితంగానూ మారుతుంది.