పూరి జగన్నాథుని క్షేత్రంలో రహస్య గదిలో సొరంగ మార్గాలేమీ లేవట..

ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయంలో రత్న భాండాగారాన్ని నిన్న మరోమారు తెరిచిన విషయం తెలిసిందే. రహస్య గదిలోని విలువైన వస్తువులన్నింటినీ తాత్కాలికంగా అయితే స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. 46 ఏళ్ల తర్వాత రహస్య గదులను తెరిచారు. అయితే అంతకు ముందు అక్కడున్న మూడు తాళం చెవులతోనూ రహస్య గది తలుపులు తెరుచుకోకపోవడంతో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బిశ్వనాథ్‌ సమక్షంలో తాళాలను పగులగొట్టాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. గత ఆదివారం 46 ఏళ్ల తర్వాత శ్రీక్షేత్రాన్ని తెరవనున్నారన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

8 మంది ప్రతినిధుల బృందం రహస్య గదిలోకి వెళ్లి పరిశీలించగా.. దానిలో కర్రపెట్టెలు, పురాతన కాలం నాటి అల్మారాల్లో స్వామి సంపద ఉన్నట్టు గుర్తించారు. ఇక నిన్న రహస్య గది నుంచి వేటివేటిని స్ట్రాంగ్ రూమ్‌కు ఓ స్టీల్‌ అలమరా, 3 కర్ర అలమరాలు, 2 కర్రపెట్టెలతో పాటు మరో ఇనుపపెట్టెను తరలించారు. ఇదంతా జస్టిస్ విశ్వనాథ్ రాథో కమిటీ ఆధ్వర్యంలో ఏడు గంటల పాటు సాగింది. స్థానిక భక్తులంతా అక్కడకు చేరుకుని ఈ వ్యవహారాన్నంతా ఆసక్తిగా తిలకించారు. నిన్నంతా దర్శనాలను నిలిపివేశారు. ఆలయం చుట్టూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బందిని మోహరించారు. అయితే ఆలయంలో మరో రహస్య గది ఉందని.. దానికి వెళ్లాలంటే ఓ సొరంగ మార్గం ద్వారా వెళ్లాలంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ గదిలో సొరంగ మార్గాలు ఉన్నట్టు ఆధారాలేవీ దొరకలేదని కమిటీ లేల్చింది.

Share this post with your friends