బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మ వారి ఆలయం పక్కనే ఉన్న దత్తాత్రేయ మందిరం ముందున్న హుండీని పగలగొట్టి నగదు, కానుకలను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఆలయంలోని ప్రసాద విక్రయ కేంద్రంలోనూ చోరి జరిగింది. దీంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఆలయానికి చేరుకుని పరిస్థితిన సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం, బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 75 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది.
హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది బాసరలో ఉంది. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఈ మందిరం చాళుక్యుల కాలంలో నిర్మితమైంది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆలయానికి వస్తూ ఉంటారు. స్థల పురాణం ప్రకారమైతే బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించాడని తెలుస్తోంది.